FTAA నూతన కార్యవర్గం
నాలుగేళ్ళ చరిత్రైనా నాలుగు దశాబ్దాలుగా సాధించలేని ఘనతను సాధించింది. భాషా ప్రాతిపదికగా ఒక స్థిరమైన లక్ష్యాన్ని గురిపెట్టి లక్ష్య సాధనలో సడలింపు లేకుండా తదేకమైన దృష్టితో సమగ్ర ప్రణాళికతో ముందుకెళుతూ ఆస్ట్రేలియాలో తెలుగు భాష గుర్తింపునకు కృషి చేసింది. ప్రపంచంలో భారత దేశం బయట తెలుగు భాషకు గుర్తించిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా వాసికెక్కింది. ఈ ప్రక్రియలో FTAA అన్ని తెలుగు సంఘాలను ఒకే త్రాటిపై నిలిపి ప్రధాన పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.
గత నెలలో జరిగిన వార్షికోత్సవంలో వచ్చే రెండు సంవత్సరాల కాలానికి క్రొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ఎంతో అనుభవం గల ఇదివరకు తెలుగు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు యువకులు కూడా ఉన్నారు. ఇది పాత క్రొత్తల మేలు కలయిక.
కార్యవర్గ సభ్యులు:
అధ్యక్షులు: శ్రీ శ్రీనివాస రావు గంగుల (మెల్బోర్న్)
ఉపాధ్యక్షులు-1: శ్రీ వసంత్ కహలూరి (మెల్బోర్న్)
ఉపాధ్యక్షులు-2: శ్రీమతి ప్రియాంక దాసరి (కాన్బెర్రా)
కార్యదర్శి: శ్రీమతి వాణి మోటమర్రి (సిడ్నీ)
కోశాధికారి: శ్రీ శ్రీకృష్ణ రావిపాటి (బ్రిస్బేన్)
సంయుక్త కార్యదర్శి: శ్రీమతి రేఖ గూడాల (బ్రిస్బేన్)
కార్యదర్శి (కల్చరల్ కోర్దినేషన్): శ్రీమతి విజయ తంగిరాల (మెల్బోర్న్)
కార్యదర్శి (కమ్యునిటీ కోర్దినేషన్) : డా.మూర్తి చెన్నాప్రగడ (సిడ్నీ)
కార్యదర్శి (మీడియా & కమ్యూనికేషన్స్): శ్రీ రావు కొంచాడ (మెల్బోర్న్)
పైనుదహరించిన వారు కాకుండా ప్రతీ రాష్ట్రానికి వారివారి రాష్ట్ర తెలుగు సంఘాల నుండి ఒక ప్రతినిధి నియమింప బడ్డారు. ఈ సారి ఎక్కువమంది స్త్రీలు కార్యవర్గ సభ్యులుగా ఉండడం విశేషం.
NAATI (National Accreditation Authority for Translators and Interpreters) వారు తెలుగు భాషను సామాజిక భాషగా గుర్తించిన నేపధ్యంలో నూతన కార్యవర్గం ఎంతో ఉత్సాహంతో మరెన్నో కార్యక్రమాలు చేపట్టి తెలుగు భాష అభివృద్ధికి మరియు తెలుగువారి అభ్యుదయానికి కృషి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
NAATI వారు తెలుగు భాషను గుర్తించిన నేపథ్యంలో కొన్ని మాధ్యమాలలో వాస్తవానికి విరుద్ధంగా వచ్చిన వార్తల కారణంగా ఈ క్రింది విధంగా ప్రకటన చేసారు.
- Credential Community Language (CCL) పరీక్ష Professional Certification కాదు. ఇందులో ఉత్తీర్ణత పొందితే భాష్యకారులు (Interpreter) గా గానీ అనువాదకులు (Translator) గా గానీ పనిచేయడానికి అవకాశం లేదు
- ఆస్ట్రేలియా బడులలో 1 నుండి 12 తరగతులలో తెలుగు భాష ఐచ్చికంగా ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇక ముందు ఈ అవకాశం కలగడానికి ఆస్కారం ఉందన్నది ఆశాభావం మాత్రమే.
అన్ని తెలుగు సంఘాలు మరియు వివిధ తెలుగు సంస్థలు FTAA తో కలిసి పనిచేయాలని తెలుగు భాష అభివృద్ధికి ఒక ఉద్యమంలా కృషి చేయాలని కార్యవర్గం పిలుపునిచ్చింది.